BHAGAVATA KADHA-3    Chapters   

విదురునితోఁగూడి ధృతరాష్ట్రుఁడు వెడలుట

46

శ్లో|| ఏవం రాజా విదురేణానుజేన | ప్రజ్ఞాచక్షుర్బోధితో హ్యాజమీఢః,

ఛిత్వాస్వేషుస్నేహసాశాన్‌ ద్రఢిమ్నో| నిశ్చక్రామ భ్రాతృ నదర్శితాధ్వా||

- శ్రీమద్భాగవతము 1 స్కం. 13 ఆ. 27 శ్లో.

''విదురుండు ధృతరాష్ట్రునకు విరక్తిమార్గం బుపదేశించిన నతండు ప్రజ్ఞాచక్షుండై సంసారంబు దిగనాడి మోహపాశంబువలన నూడి విజ్ఞాన మార్గంబునం గూడి దుర్గమంబడు హిమవన్నగంబునకు నిర్గమించెను.''

- శ్రీమదాంధ్ర భాగవతము.

సుమత విదుర కే వచన బంధువర అతిహర్షయే,

గద్గద గిరా గంభీర నీర నయనని మేఁఛాయే ||

ధన్య ధన్య లఘభ్రాత హీథ గహి తాత ఉబార్యో,

అంధకూప మేఁ పతిత పతిత కూఁ పకరి నికార్యో ||

నబకూఁసోపత ఛోడి కేఁ, గాంధారీ కే సాథ్‌ మేఁ

విదుర బతాయే మార్గ తేఁ, చలే హాథ్‌ దే హథ్‌మేఁ ||

అర్థము

విదురుని వాక్యములను విని ధృతరాష్ట్రుఁడత్యంత హర్షమును జెందెను. గద్గదస్వరముతో గంభీరముగ కంటనీరు గార్చుచు నిట్లనెను:- సోదరా! నేను ధన్యుఁడను నాచేతులు పట్టుకొని నన్నుద్ధరింపుము. అంధకార కూపములోఁ బడిన పతితుఁడనగు నన్నుద్ధరింపుము.

అందరును నిద్రపోవుచుండఁగా నందఱనువదలి గాంధారి తోఁగూడ విదురుఁడు చెప్పిన మార్గమునఁ జేతులు చేతులు పట్టుకొని బయలుదేఱి వెళ్లిరి.

మనలను శ్యామసుందర చరణారవిందముల వైపునకు మరలించినవాఁడే నిజమగు సుహృదుఁడు. మన మనస్సులను సాంసారిక వ్యవహారములనుండి తొలిఁగించి హరిభక్తియందు లగ్నముచేయునట్లు చేసినవాఁడు వాస్తవమగు బంధువు. అత్మోన్నతికి సహాయము కావించువాఁడే యథార్థమగు సంబంధుఁడు. వీరు కాక మిగిలిని మిత్రపుత్ర, బంధు బాంధవులు కేవలము బంధన కారణమగుదురు. సంసారములో నధికముగా బంధించు వారు మోహపాశమును బంధించు వేటకాండ్రు. విదురుఁడు ధృతరాష్ట్రునికి నిజమగు హితైషి.

విదురుఁడు తన సోదరునికి అనుకవిధముల నచ్చచెప్పఁగా నంత్యకాలమున నిచ్చట నుండుట యేవిధముగఁజూచినను మేలు కాదని తెలిసికొనెను. అతఁడు తనసోదరుని మాటలను విని గృహత్యాగము కావించుట కుద్యుక్తుఁడయ్యెను.

ఒక దినమున రాత్రియందు అందఱు నిద్రపోఁగా ధృతరాష్ట్రుఁడు మెల్లగా లేచి, విదురుని భుజమును బట్టుకొని ''వెళ్లుదము పద'' అనెను.

గాంధారి సదా భర్తదగ్గఱనే యుండులచేతను, దన పాతివ్రత్య ప్రభావముచేతను సమస్త విషయములను దన దివ్య దృష్టిచేఁ దెలిసికొని, ఆమెకూడ తన దండమును గైకొని, భర్త చెఱఁగును బట్టుకొని బయలుదేరెను.

సడి పట్టి ధృతరాష్ట్రమహారాజిట్లనెను:- ''ఎవరు? రాణీ! నీవెక్కడికి బయలు దేరినావు?''

గాంధారి కొంచెము వ్యంగ్యస్వరముతో నిట్లనెను:- ''రాజు వెళ్లు చోటకు రాణికూడ వెళ్లును. రాజులేకున్న రాణి కేమి శోభకలదు?''

ధృతరాష్ట్రుఁడత్యంత స్నేహ స్వరముతో నిట్లనెను:- ''దేవీ! మేమిప్పుడు మహాప్రస్థానమునకుఁ బోవుచున్నాము. అక్కడ భోజనపుటేర్పాటు లేదు. వాహనములులేదు. దాసదాసీ జనములు లేరు. కాలినడకను అరణ్యములందును బర్వతములందను దిరుగవలసి యుండును. అరణ్యములలోని వగరు, చేదు ఫలములను దినవలసి యుండును. అవియైనను స్వయముగ వెదకి తెచ్చుకొన వలయును. దేవీ! నీ శరీరము సదా సుఖభోగములతోఁ బెంపఁబడినది. నీవు దీనికి పనికిరావు. ఇచ్చటనే యుండి కుంతీ సహితముగఁ గృష్ణకథాకీర్తనములోఁ గాలయాపనము కావించువు.''

గాంధారి యిట్లనెను:- ''దేవా! నేఁడు మీరిట్టి విచిత్ర ములగు పలుకులు పలుకుచున్నారేల? శరీరమును వదలి ఛాయయుండఁగలదా? చంద్రుని విడిచి వెన్నెలుండఁగలదా? కాంతి ప్రభాకరుని వదలియుండఁగలదా జలము శాశ్వతముగ శీతలత్వమును వీడఁగలదా? చేఁప జలమును వీడి యుండఁగలదా? అట్లే పతివ్రత యెన్నఁడైనఁ బతిని వీడియుండఁగలదా? నాకు భోగ, వాహన, దానదాసీ, ఐశ్వర్య ధనాదులక్కఱలేదు నాకు మీరే కావలయును. నాకు మీరే ధనము. మీరే నా సర్వస్వము. మీరున్నచోట సర్వమును గలదు. మీరు లేని చోట యెన్నియున్నను నేమియు లేనట్లే.,''

మధ్యలో నందుకొని విదురుఁడిట్లనెను:- ''అన్నా! ఇది వాదవివాదమునకు సమయము కాదు. పతివ్రతయగు మావదినగారు అట్లంగీకరింపరు. మిమ్ములను వీడి యామె యుండఁజాలదు. మీరామెను ఆప వలదు. రానిండు'' ఇది విని యికఁధృతరాష్ట్రుఁడడ్డగింప లేదు. ముగ్గురును లేచి బయలు దేరిరి. కావలివారి కెవరికిని దెలియకుండునట్లు బుద్ధిమంతుఁడగు విదురుడిదివఱకే యేర్పాటు చేసియుండెను. కావుననే వారు రాత్రివేళ యెవరికిని దెలియకుండగనే నగరము వెలుపలికి వెళ్ళిపోయిరి. విదురుఁడు చాల బుద్ధిమంతుఁడు. కావుననే యాతఁడాదినమున నింక ముందుకు సాగిపోలేదు; ఏలననఁగా ముందు ధర్మరాజు తన భటులచే నలుగడల వెదకింపగలఁడు. అందువలన గంగాతీరమున నొక నిర్జన స్థానమున సూర్యోదయము కాకపూర్వమే వెళ్లి దాఁగుకొనిరి.

ఇచ్చట ప్రాతఃకాల మయ్యెను. ధర్మరాజు నియమాను సారముగ నరుణోదయమునకుఁ బూర్వమే లేచెను. స్నానసంధ్యాగ్నిహోత్రాదులను బూర్తిచేసికొని యాతఁడు మంగళ ద్రవ్యమలు దర్శించెను. అంతఁదనకాశ్రితులగు నసంఖ్యాకము లగు బ్రాహ్మణులకు గో, భూ, హిరిణ్య, తిలాది దానములను, అన్నవస్త్రములను దానముచేసెను. ప్రతిరోజు వెళ్లినట్లాతఁడు ధృతరాష్ట్రునకు చరణాభివందనము చేయవెడలెను. అక్కడికివెళ్లి చూచునప్పటికి అచ్చటివస్తువులన్నియుఁజెల్లాచెదురుగఁబడవేయఁబడియుండెను. ఆతనికి సందేహము కలిగెను. మహుశః కాల కృత్యములకు వెళ్లియుండవచ్చు ననుకొని, తర్వాత గాంధారి పరుండు శయ్యను గాంచెను. అదికూడ శూన్యముగ నుండెను. ఆతని గుండె దడదడ కొట్టుకొనఁ జొచ్చెను. విదురుని శయ్య దగ్గఱకుఁబోయి చూడ నదియు శూన్యముగ నుండెను. తన పెదతండ్రియుఁ, దల్లియుఁ, బినతండ్రియు వారిని వదలి యెచ్చటికో వెళ్లిపోయిరని నిశ్చయించుకొనెను. ఆతఁడాతురతతో నుచ్చైస్వరముతో నిట్లు కేకవేసెను:- ''సంజయా! సంజయా! శీఘ్రముగా రమ్ము!'' సంజయుడెచ్చటికి పోలేదు. ఆ సమీపమునఁ గూర్చుండి యేడ్చుచుండెను. ధర్మరాజు వచ్చిన సంగతియే అతనికి తెలియదు. ధర్మరాజు బిగ్గఱగాఁ బిలుచునప్పటికి ఆతని ధ్యానమునకు భంగము కలిగెను. శీఘ్రముగా లేచి చేతులు జోడించి, కన్నుల నీరు గార్చుచు సంజయుఁడు మెదలకుండ వచ్చి ధర్మరాజు దగ్గఱనిలుచుండెను. ఆతఁడు నేఁడు మామూలు ప్రకారము ధర్మరాజును స్తుతింప లేదు. సూతుఁడిట్లుండుటను గాంచి దయాళుఁడగు ధర్మరాజేడ్చుచు నిట్లడిగెను:- ''సంజయా! నా తల్లి దండ్రు లెచ్చటికి పోయిరి? అయ్యో! నేను నేఁడు వారి శయ్యలు శూన్యముగ నుండుటను గాంచుచున్నాను. నేనాతని పాదాభివందనము కావింపవచ్చి యున్నాను; కాని నేఁడు నాకాయన దర్శనము కాలేదు. పాపినైన నేనేపాపమును జేసితినో కాని ఆతఁడసంతుష్టుఁడై మమ్ము వదలి వెళ్లిపోయినాఁడు. అయ్యయ్యో! ఈ ప్రపంచములో మమ్ముఁబోలిన భాగ్యహీను లింకెవరుందురు? మా తండ్రి మమ్ములను బాల్య కాలములోనే విడిచి కాలకబళితుఁడయ్యెను. మా పితామహుని నేను నాదుర్బుద్ధిచే స్వయముగఁజంపించితిని. నా కులవినాశమంతయు నాకారణమున జరిగినది. ఇంక మిగిలినది నా పెదతండ్రి ఆతఁడు మాతండ్రి చనిపోఁగానే మమ్ములను బెంచి పెద్దవారిని జేసెను. వీరి సేవచేసి నాపూర్వకృత పాపములకుఁ బ్రాయశ్చిత్తము చేసికొనవచ్చు ననుకొంటిని. కాని నాకుటిల తాకారణలమున నాతఁడుకూడ యెక్కడికో తెలియకుండ వెళ్లిపోయి నాఁడు ఆతఁడిప్పుడెంతోకాలము జీవింపఁడు. ఆతని పుత్రులందఱు మరణించిరి. ఆతఁడు గ్రుడ్డివాఁడగుటచే నేమియుఁ గనపడదు.

నిశ్చయముగా నాతఁడు గంగలో దుమికి ప్రాణపరిత్యాగము కావించుకొని యుండవచ్చును. విదురుడు మాకు ప్రాణదాతయే. తండ్రి తర్వాత నాతఁడే మమ్ములను రక్షించుచుండెను. ఆతఁడే మమ్ములను ననేక విపత్తులను భయంకర సుడిగుండములనుండి రక్షించెను. సంజయా! నీవు మా పెదతండ్రి, పినతండ్రుల వద్ద నెప్పుడు విడువక నుండెడు వాఁడవు. అట్టి నీ సమ్మతిలేక వారెట్లు పోఁగలుగుదురు? నీవే వారికి సరియగు సలహా నీయఁగల విశ్వసనీయ మంత్రివి. వారు తప్పక నీకు చెప్పియే వెళ్లియుందురు. నీవు నాకు వారిజాడను జెప్పుము. లేగ దూడ తన తల్లివెంట నెట్లు పరుగిడునో అట్లే వారి జాడ తెలిసిన నచ్చోటుకు నేను బరువిడెదను. వారి శుశ్రూష చేయు చుండుదును.''

సూతఁడసలే దుఃఖితుఁడై యుండెను. శోకకారణమున నాతని యింద్రియములన్నియు నాకులము చెందియుండెను. నేత్ర ములనుండి యెడతెగక నశ్రుప్రవాహము ప్రవహించు చుండెను. కంఠము గద్గదమగుటచే నాతఁడేమి పలుకుటకును నసమర్థుడై యుండెను. ధర్మరాజు వానిని మాటిమాటికి ప్రశ్నించుచుండెను. చివరకు ధైర్యము తెచ్చుకొని యాతఁడు తన నయనాశ్రువులను దుడిచికొనెను. విచారముద్వారా స్వస్థచిత్తుఁడై యాతఁడు ప్రకృతిస్థుఁడై, తనస్వామియగు ధృతరాష్ట్రుని చరణములను జింతించుచుఁ జేతులు జోడించి యిట్లనెను:- ''ప్రభూ! మీరు నా మాటలను నమ్ముఁడు. నేను మీతో యథార్థమును జెప్పుచున్నాను. ఈ విషయమున నాతఁడు నాయభిప్రాయమును దీసికొనలేదు. ఆతని మనస్సులో నేమున్నదో, నేనాతని దగ్గఱనున్నప్పటికిని ఆపోకడయేమియు నాకు తెలియలేదు. కురుకుల తిలకా! ధృతరాష్ట్రమహారాజు నాకు చెప్పక యేకార్యమును జేయడని నాకు పరమ విశ్వాసము. ఇంతవఱకు నట్లే జరుగుచు వచ్చినది. ఎంత చిన్న విషయము కానిండు, పెద్దవిషయము కానిండు ఆఁతడు నన్నడుగక యేమియుచేయఁడు. ఇదియే నాగర్వము కాని నేఁడు నాగర్వము ఖర్వమై పోయినది. నన్నామహారాజు మోసగించినాఁడా. ఇంతగా స్నేహ విశ్వాసములను బెంచి చివరకు నన్ను వంచించినాఁడు. పాపినగు నన్ను వారిసేవ చేయ నెడఁబాపినాఁడు. నన్ను వారివెంటఁ గొనిపోవలేదు. ఇప్పుడు నేనీ వృద్ధావస్థలో నా ప్రభువులేక యెట్లు జీవింపఁగలుగుదును?'' ఇట్లు పలికి సంజయుఁడు వెక్కివెక్కి పసిపిల్లలవలె నేడ్వఁబ్రారంభించెను. తనకుఁజెప్పకుండఁగనే పోయినట్టు సంజయునకుఁగూడ చెప్పకుండ పోయినాఁడని ధర్మరాజు నిశ్చయించుకొనెను. ఆతఁడిట్లు తలచెను:- ''సాయంకాలమున నందఱును సుఖపూర్వకముగ నాముందఱనే నింద్రించిరి. వారర్థరాత్రియైన తర్వాతనేపోయి యుండవలయును. ఆతఁడు వృద్ధుఁడు సంధుఁడు కూడాను. ఆతఁడెంతో దూరము పోయి యుండఁడు. కావున నేను శీఘ్రముగఁ జారులను, సైనికులను బంపి వారిని వెదకించెదను.''

ధర్మరాజిట్లనుకొనుచుండఁగా నాతని యేడ్పు పెడ బొబ్బలు వని యాతని తమ్ములుకూడ వచ్చిరి. కుంతీదేవికూడ రోదనముచేయుచు వచ్చి తన బావను, తోడికోడలను, మఱది విదురుని గానకర వెక్కి వెక్కి యేడ్వఁబ్రారంభించెను.

శౌనకుఁడిట్లడిగెను:- ''సూతా: కుంతీ దేవికూడ గాంధారీ ధృతరాష్ట్రులతోఁ దపోవనమునకుఁ బోయినదని వినియుంటిమి. మీరు గాంధారీ ధృతరాష్ట్రులు విదురునితోఁబోయిరని చెప్పు చున్నారిదియేమి?''

సూతుఁడిట్లనియె:- ''ఋషులారా! ఇట్టిది వేఱొక కల్పములో జరిగియుండవచ్చును. కల్పభేదములను బట్టి కథలలోఁ జాల భేదముండును. లోకములోఁ గ్రొత్త విషయ మేమియును లేదు. పురాతన సంఘటనములు పునరావృత్తియగులకే ఇతిహాస మని పేరు. ప్రతికల్పములోను ద్వాపరాంతమున మహాభారతము జరుగుచుండును. ఆసంఘటనములు పునరావృత్తియగుచుండును. ఒక్కొక్క కల్పములోఁ గొంచెము మార్పుండను. ఈ భాగవత కథాప్రసంగములోఁ బాండవుల జననియగుఁగుంతీదేవి తపో వనములకుఁబోలేదు. ఆమెమనస్సు శ్రీకృష్ణచరణారవిందములందే లగ్నమైయుండెను. అర్జునుఁడు ద్వారకకు వెళ్లినాడు. ఆతఁడు తిరిగి వచ్చనతర్వాతఁ దనకు రక్షకుఁడగు శ్రీకృష్ణసమాచారమును విని కర్తవ్యమును నిర్ణయించుకొనవలెనని యామె నిశ్చయించు కొనెను. ఇట్లు చింతించి కుంతీ దేవి యచ్చటనే యుండి విచార మనస్కయై కింకర్తవ్య విమూఢయై హస్తినాపురములోనే యుండెను. ''

ధర్మరాజు నలువైపులను జారులను బంపి వెదకించెను గాని వారు దొరకలేదు. ధర్మరాజు చింతించెను. ఒక దినము రామకృష్ణ గుణ గానము చేయుచు వీణాగాన మొనర్చుచు దేవర్షియగు నారదుఁడచ్చటకు వచ్చెను. నారదునిఁగాంచి నీటమునిఁగినవాఁడు తనవైపునకు నావవచ్చుటను గాంచి సంతసించు నట్లు పాండవులందఱును సంతసించిరి. చనిపోయినవానికి సంజీవని లభించినట్లును, పుట్లుగ్రుడ్డికి కనుచూపు లభించినట్లును నారదుఁడు రాగానే అందఱకును సర్వజ్ఞుఁడగు ఋషి వచ్చినాఁడను సంతోషమయ్యెను. బ్రహ్మాండ మంతటను నీతనికిఁ దెలియని విషయమే లేదు. ఇప్పుడిఁకఁదప్పక అందఱజాడ తెలియఁగల తనుకొనిరి. ఇట్లనుకొను చుండఁగనే నారదుఁడు సమీపమునకు వచ్చెను. అందఱును లేచి ఆతనికి పాదాభివందనము కావించిరి. అర్ఘ్యపాద్యాదు లొసంగి విధ్యుక్తముగఁబూజించిరి. ఋషి స్వస్థచిత్తుఁడై సుఖపూర్వకముగఁ గూర్చుండునప్పటికి ధర్మరాజు చేతులు జోడించి యిట్లనెను:- ''ప్రభూ! నేఁడు నేను గొప్ప చింతలోఁబడియున్నాను. దానినుండి నన్నుద్ధరింపుడు.''

నారదుఁడిట్లనెను:- ''రాజా! నీముఖమండలమును జూచియే నీవేదో చింతలోఁబడియున్నట్లు తెలిసికొన్నాను. నీ దుఃఖకారణమును నాకుఁజెప్పుము.''

ధర్మరాజు చేతులు జోడించి యిట్లనెను:- ''స్వామీ! మీరు సర్వజ్ఞులు మీ సమ్ముఖమున మాటలాడుటకూడ ధృష్టతయే కాఁగలదు. మీరు సమస్తప్రాణులయొక్క విషయములెఱుఁగుదురు. మీరడుగు చున్నారు. కాఁబట్టి నేనడుగుచున్నాను. నాకు పితృసమానులగు ధృతరాష్ట్ర విదుడరులును తల్లియగు గాంధారియు స్వస్థచిత్తులరై నిద్రించిరి. కాని నేను ప్రాతః కాలమునలేచి చరణాభివందనము చేయఁబోవఁగా వారిచ్చటలేరు. ఈ దుఃఖసాగరములో నాహృదయము మునిఁగిపోయినది. దానినుండి బయటకు నాకు దారి దొరక లేదు. ఈ శోకసాగరము నుండి బయట వేయఁగల కర్ణధారుఁడవు నీవే. ప్రభూ! నా పితృవ్యులు, తపస్వియగు మా తల్లి గాంధారీదేవియు నన్నువీడి నాకు చెప్పకయే యేల వెళ్లిపోయిరో చెప్పుఁడు. ఎచ్చటకు వెళ్లిపోయినారు? మమ్ముల నేయపరాధముచే వదలివేసినారు?''

ధర్మరాజు పలుకు స్నేహయుక్తములగు సుందరశోకయుక్తవచనములను విని వక్తలలో శ్రేష్ఠుఁడు నారదమహాముని యిట్లనెను:- ''రాజా! ఇంతటి జ్ఞానివి, ధ్యానివి, తేజస్వివి, తపస్వివి యైయుండి నీవిట్లజ్ఞానపు వాక్యములను బలుకుచుంటివేల? ఎవరు ఎవరికి సుఖదుఃఖము లొనఁగూర్పగలరు? ఈ ప్రపంచ మంతయు నాసర్వేశ్వరుని యాజ్ఞచే వర్తించు చున్నది. జీవులందఱును దైవాధీనులై కార్యము లొనర్చుచున్నారు. భూమి మీఁద ప్రతి అన్కపు గింజలో నందఱ నామము లంకితములై యున్నవి. ప్రతి జలకణములో సర్వుల నామములు లిఖింపఁబడియున్నవి. ఎవరెవరెన్నిదినములవఱ కెంతెంత అన్నజలకణముల ననుభవింపవలెనని వ్రాయఁబడి యున్నదో అంతవఱకు భోగముల ననుభవింపవలయును. ఆ అవధి తీరిపోగానే లక్షప్రయత్నములు చేసినప్పటికిని ఒక్కనిమిషమైన నుండఁజాలఁడు. ఈ చరాచర విశ్వమంతయు నాప్రభుప్రేరణచేఁబ్రేరితమై సమస్తక్రియలందుఁ బ్రవృత్తమగుచుండును. మానవులు, దేవతలు, పశుపక్ష్యాదులు, సరీసృపములు, వృక్షాదులు సంగతి యేల, ఇంద్ర, వరుణ, కుబేరాది లోకపాలు రనఁబడు వారుకూడ ఆతని ప్రేరణలేక యేమియుఁజేయజాలరు.''

ధర్మరాజిట్లనెను:- ''స్వామీ! ఇది నిజమే కాని ప్రియజన సంయోగముచే సుఖమును, వియోగముచే దుఃఖమును గలుగుచునే యుండును.''

నారదుఁడిట్లనెను:- ''కలిగినఁ గలుగ నిమ్ము. నీవు సుఖ దుఃఖములున్నవని సంయోగవియోగములు కలుగకుండఁ జేయఁగలవేమి? ఎవరితో సంయోగము కలుగవలసి యుండునో కలుగనే కలుగును. నీవు ప్రయత్నించి దానిని కాదనఁజాలవు. కాల పక్వమై వచ్చిన వియోగము ఆవశ్యం భావియగును. ఏనుఁగు మావటివానికిని, గుఱ్ఱము రౌతుకును, ఎద్దు రైతుకును వశ##మైనట్లు జీవులందఱును బ్రారబ్ధమునకు వశులై యున్నారు. ఒకవేళ నున్మత్తము చెందిన యేనుఁగు, గుఱ్ఱము, ఎద్దు, గేదె త్రాడు తెంచుకొని స్వేచ్ఛాచరణము చేసినఁజేయునేమో కాని మానవుఁడు ప్రారబ్ధ బంధనమును దెంచుకొని స్వేచ్ఛాచరణము కావింపలేఁడు ఆతఁడు ప్రారబ్ధ పరిధిలోనే పడియుండవలసీ యుండును.''

ధర్మరాజిట్లనెను:- ''అయితే యీ సన్న్యాసులు, బ్రహ్మచారులు, వానప్రస్థులు మొదలగు వారు స్వేచ్ఛాచరణము కావించుచు సాధన చేయుచున్నారే వారెట్లు చేయుచున్నారు?''

నారదుఁ డిట్లనెను:- ''స్వేచ్ఛగా నెక్కడ చేయుచున్నారు? వీరందఱును వేదశాస్త్రరూపమగు ఆజ్ఞాబంధమును గట్టఁబడి వివశులై ప్రారబ్ధకర్మానుసారముగఁగార్యము లొనర్చుచున్నారు. ఈ విషయమున నీవొక దృష్టాంతమును వినుము చిన్నపిల్లవానిని జూడుఁడు. ఆతఁడాడుకొనుచు నిసుకతో నిండ్లు కట్టును. నదిలోని మెత్తని మట్టిని దీసికొనివచ్చి దానితో నాతఁడు గుఱ్ఱములను, నేనుఁగులను, ఒంటెలను, దూడలను మొదలగు ఆటవస్తువులను జేయును. ఇంటిలో నొక గుఱ్ఱపు కొట్టమును నిర్మించి గుఱ్ఱము నక్కడ కట్టివేయును, గోశాలను నిర్మించి దానిలో నావులను, ఆవుదూడలను గట్టివేయును. ఆ మెత్తని మట్టితో ననేక స్త్రీపురుషు విగ్రహములను జేసి కూర్చుండఁబెట్టెను. పిలుచుటకు మాత్రము చాలమంది కలరు. స్త్రీలు, పురుషులు, నౌకరులు, యజమాని, సంబంధులు, ఏనుఁగులు, గుఱ్ఱములు, ఒంటెలు, గోవులు, ఎద్దులు, గేదెలు, వేయేల అన్నియుఁగలవు. కాని యివి యన్నియు మట్టితోఁజేయఁ బడినవియే. అన్నిటిలో నున్న పదార్థమొక్కటే, కేవలము ఆకృతి భేదమే, ఆ యాకృతియైనను పిల్లవాఁడు తన బుద్ధిచాతుర్యముచేఁజేయఁబడినవే. ఇప్పుడాతఁ డే యాటవస్తువునైనను దన యిష్టమువచ్నిన చోట నుంచఁగలడు. ఆవులలోనికి గుఱ్ఱములను దీసికొనిపోయి కట్టివేసిన నా మృద్వస్తువులు కాదనవు. వాటిని దీసికొనిపోయి మనుష్యుల నెత్తినఁబెట్టిన వారు తీసి పారవేయలేరు. ఇవన్నియు బాలకునకు వినోదమాత్రములు. వానికి బుద్ధిపుట్టిన మరల వీటన్నిటిని విఱిచి తుక్కుతుక్కుచేసి పారవేయును. ఆట అయిపోయినది. అన్నియు నేకమైనవి. అట్లే యీ జగత్తంతయు జగత్పతియొక్క క్రీడాస్థలము. ఆతఁడు తన యిచ్ఛననుసరించి కొందఱకుఁ గొందఱతో సంయోగము కలిగించును, కొందఱకుఁగొందఱతో వియోగము కలిగించును.''

ధర్మరాజిట్లనెను:- ''స్వామీ! ప్రారబ్ధమను విషయము నిజమేకాని, మా పెదతండ్రి, పెత్తల్లి యిన్నాళ్లు మా వద్దనుండి మమ్ములను బోషించినారు. వారి కొఱకై దుఃఖము కలిగితీరును.''

నారదుఁ డిట్లనెను:- వారి విషయమున దేనినిఁ గూర్చి నీవు శోకమును జెందుచున్నావు ఆతనిలో మూఁడు భావములు కలవు ఒకటి దేహము, రెండవది జీవుఁడు, మూఁడవది బ్రహ్మ. దేహ మనిత్యమైనది. అది యెప్పటికైన నాశనమై తీరును. ఇవ్వేళ కాకున్న, రేపైనను, రేపు కాకున్న నెల్లుండియైనను దాని నాశనము తప్పదు. అనిశ్చిత నాశముగల దానినిఁగూర్చి చింతించుట చతురపురుషులకు శోభనీయదు -జీవుభడవినాశి. వానికి నాశనమేలేదు. వానికి నాశనమేలేనప్పుడు దానినిఁగూర్చి చింతిపనేల? చింత పోయినవస్తువునకై యుండవలయును. బ్రహ్మ యీ రెండు భావములు లేనివాఁడు. ఇప్పుడు నీవు దుఃఖించునది దేనినిగూర్చి? ఇది కేవలము నీకుఁగలిగిన మోహజన్యస్నేహమే ఆ కారణముననే ఇంతగా దుఃఖము కలుగుచున్నది.''

ధర్మారా జిట్లనెను:- ''మంచిది. శోకింపకూడదంటివి. మా పెదతల్లియుఁ బెదతండ్రియు గ్రుడ్డివారు. వారికేమియు గనపడు కదా! వారిని రక్షించుభారము నాపైఁగలదుకదా!''

నారదుఁడు నవ్వి. యిట్లనెను:- ''రాజా! వారిక్కడనున్నంత వఱకు వారిని సేవించుట నీకు ధర్మమే. వారు బుద్ధి పూర్వకముగ నిల్లు వదలి వెళ్లిపోయిన నీవు ఎక్కడెక్కడికని వెళ్లి రక్షించుచుఁ దిరుగుచుందువు? గర్భములోని బాలకుని రక్షింపఁగలవా యేమి? నీటిలోఁగల అసంఖ్యాకములగు జల జంతువులకు నీవు నీమహలులోనుండి ఆహారమును బంపెదవా యేమి? ఆకాశములోఁగల అనేక జంతువుల కాహారమెవరు పెట్టఁగలరు? కురుకుతిలకా! నేను లేకున్న వారిని రక్షించున దెవరను భ్రమను నీ హృదయమునుండి తీసిపారవేయుము. నీ తలిదండ్రులెట్లు నీవు లేకున్న జీవింతురని తలసోయకుము. భగవంతుడు ప్రతివానికినిఁ బుట్టుకతోడనే ఆహారమును గల్పించి యున్నాఁడు. అందఱయొక్క యీపాంచభౌతిక శరీరములు కాల, కర్మ, గుణత్రయముల కధీనములైనవి. బేదమేమనఁ గొందఱకు పుణ్య మధికము. కొందరకు పాపమధికము. కొందఱ సత్త్వగుణ ప్రధానులు, కొందఱు రజోగుణ ప్రధానులు, కొందఱు తమోగుణ ప్రధానులు, అందఱును కాల, కర్మ, గుణములకు వివశులై కర్మలోనర్చుచుండఁగాఁదాము స్వతంత్రులై యితరుల నేమి రక్షింపగలుగుదురు? చచ్చినవాఁడెవరి నైనఁజంపఁగలుగునా? నీట మునిఁగినవాఁడు నీట మునుఁగఁ బోవువానిని రక్షింపఁగలఁడా విషమును దిని చావఁబోవు వాఁడు విషపీడుతుఁడగువాని నెట్లు రక్షింపఁగలుగును? సర్ప దష్టుఁడగువాఁడితరుల నెట్లు రక్షింపఁగలుగును.''

ధర్మరాజిట్లనెను:- ''స్వామీ! మీరు చాల విచిత్రములగు పలుకులు పలుకుచున్నారు. అట్టియెడ దయా, ధర్మ, పరోపకార పురుషార్థము లేమియు నుండవు కదా! కర్మ మీఁదఁగల ఆశ##చేఁ జేతులలోఁ జేతులు పెట్టుకొని కూర్చుండిన నేకార్యము నెఱవేరదు సరిగదా, అందఱుఁ జచ్చిపోవుదురు.''

నారదుఁడిట్లనెను:- ''రాజా! పురుషార్థమైనను అందఱుఁ చేయఁజాలరు. పురుషార్థముగాని, దాని ఫలముగాని ప్రారబ్ధకర్మాధీనములే. భగవంతుఁడే అందఱకు అన్నివృత్తుల నిశ్చయించినాడు జీవులందఱు జీవములవలననే జీవించుచుండును. గడ్డి, చెట్టు, ఆకు మొదలగు వాటిలోఁగూడ జీవము కలదు. వాటినిఁ దిని పశు పక్ష్యాదులు జీవించును. పవువులను బెంచి వాటితో వ్యవసాయము చేసి పంటలను బండించి మానవులు బ్రదుకుదురు. చాలమంది నిర్దయులు గొఱ్ఱలను, మేకలను, జింకలను మొదలగు వాటిని జంపికూడ తినుచుందురు. జలములోనుండు తిమి, తిమింగలాదులు చిన్న చిన్న చేపలను దిని జీవించును. ఈ విధముగా నన్నియు జీవులమీఁదనే ఆదారపడియుండును మీ పెదతల్లి, పెదతండ్రి, పినతండ్రి, వన్య ఫలములతో జీవింపఁ గలుగుదురు. వారిని గూర్చి చింతించుట వ్యర్థము.''

ధర్మరాజాశ్చర్యముతో నిట్లనెను:- ''ప్రభూ! అద్భుత జ్ఞానమును మీరు చెప్పుచున్నారు. భోజ్యము, భోక్త ఒక్కఁడే జీవులద్వారా జీవి జీవనధారణ చేయుచున్నాఁడు.''

నారదుఁ డిట్లనెను:- ''అయితే నీ వేమనుకొనుచున్నావు? స్వయంప్రకాశుఁడగు నాభగవానుఁడు సమస్త రూపములలో నుండి నవ్వుచున్నాఁడు. ఆతఁడే నానారూపములు ధరించి క్రీడించుచున్నాఁడు. ఆయన తప్పితే యింకెవరున్నారు? ఫల పుష్పములలో నాతఁడే కలఁడు. మహాభారత యుద్ధములోఁ జచ్చిన వారందఱలోను ఆత్మస్వరూపుఁడుగ నున్నాఁడు. మఱియుఁ గాలరూపుఁడై యందఱను సంహారము కూడ ఆతఁడే చేసినాఁడు. నీవు శ్రీకృష్ణునిఁగూర్చి నీవేమనుకొన్నావు? ఆకాలుఁడు భగవంతుఁడు. నీవు నీసఖునిఁగాను, సంబంధిగాను, మిత్రునిగాను, సారథిగాను దలఁచుచున్నావే ఆకృష్ణుఁడు కాలునకుఁగూడ కాలుఁడు. భూమికి భారభూతులగు వారినందఱను సంహరించి యిప్పుడు యదువంశ సంహార విషయమునుగూర్చి యోచించు చున్నాడు. ఇదియంతయుఁజేసిన తర్వాత నాతఁడీధరాధామమును వదలి తన నిత్య శుద్ధ సనాతన లోకమునకు వెళ్ళిపోవున. భగవంతుఁడీ భూమిని వదలీ వెళ్లిపోఁగానే కలి ప్రవేశించును. అప్పుడు భూమి మీఁద నుండుటకు యోగ్యముగ నుండదు. మీరందఱును దీనిని వదలి మహాపథము ననుసరింతురు.''

ధర్మరాజున కంతయుఁదెలిసెను. ''మా కందఱకు కాల మొక్కసారియే ఆసన్నమైనది. నేను గూడ ఇఁక గృహత్యాగము చేయవలయును.'' అనుకొనుచు నాతఁడు కాలస్వరూపుఁడగు భగివానునిఁ బ్రత్యక్షముగఁ జూచుచుండెను. ఆతడిట్లడిగెను:- ''ఓసర్వజ్ఞా! మీకన్నియుఁదెలియును. నా పెదతండ్రి యొక్కయుఁ బెదతల్లియొక్కయు, పినతండ్రియొక్కయు జాడ చెప్పవలయును. వారెక్కడికి వెళ్లిరి?''

నారదుఁడిట్లనెను:- ''ధర్మరాజా! నీవు చింతింపవలదు. వారందఱు ధర్మాత్ములు. వారికి దుర్గతి కలుగఁజాలదు. హిమాలయమునకు దక్షిణ భాగమున భాగీరథీగంగ హిమాలయము నుండి దిగి నేలమీఁదకు పారునటువంటి గంగాద్వారము (హరి ద్వారము) దగ్గఱ సప్తర్షులయొక్క సుందరమగు నాశ్రమము కలదు. సప్తమహర్షుల తపస్సునకు మెచ్చి సురాపగయగు గంగ యేడు ధారలుగఁ బ్రవహించెను. అందువలన దానికి సప్తశ్రోత యను ప్రసిద్ధి కలిగినది. అచ్చటికే మీ పెదతల్లి, పెదతండ్రి, పినతండ్రి వెళ్లి సుఖముగ నున్నారు.''

ధర్మరాజిట్లనెను:- ''ప్రభూ! అక్కడ వారు చేయునదేమి? వారి కాహారమెట్లు దొరుకుచున్నది?''

నారదుఁడిట్లనెను:- ''ధర్మరాజా! నీవుకూడ యిట్టి తికమక మాటలు పలుకు చున్నావేమి? పిచ్చివాఁడా! శ్రీకృష్ణస్మరణ చింతనములు, గుణలీలాశ్రవణమే నిజమగు నాహారము. నీ తలిదండ్రులు, పినతండ్రి ఆ యాహారముతోడనే సంతుష్టినిఁ జెందుచున్నారు. వారు పుణ్యసలిల యగు గంగాపులినమందు త్రికాల స్నానము చేయుచున్నారు. ఇంతవఱకు వారగ్నిహోత్ర పరిత్యాగము కావింపలేదు కాని ఆహారమును వదలి పెట్టినారు. వారు నిత్యనియమముతో నమృతోపమానమగుఁ బునీత గంగా జలమును బ్రతిదిన మాహారముగఁ బానము చేయుచున్నారు. వారింకేమియుఁ దినుట లేదు. వారు సంయమముతో ఆసనము వేసికొని ప్రాణాయామాభ్యాసము చేయుచు మనస్సును, సమస్తేంద్రియములను వశపఱచుకొననారు. కురుకుల మకుటమణి యగు నో ధర్మరాజా! ఈ సత్త్వరజస్తమోగుణము బంధన హేతువులు, ఇవే త్రాడులు, ఈ గుణములే జీవులను బంధించు చున్నవి. నిరంతరము శ్రీహరిస్మరణ చేయుటచే నీ గుణముల మలము నశించిపోవును. అహంకారమును బుద్ధితోఁగలిపి సాక్షీచైతన్యమందు దానిని లీనము కావించినవాఁడే త్రిగుణాతీతుడగును. ఆ స్థితిలోఒ నీ సాక్షీచైతన్యమును శుద్ధ సచ్చిదానంద ఘనముతో నైక్యము కావించిన నిఁక మిగులున దేమున్నది? బిందువు సింధువులోఁ గలిసినది. విస్ఫులింగమలు నిత్యాగ్ని లోఁ గలిసి ఏకత్వమును జెందినవి. ఘటాకాశము మహాకాశములోఁ గలిసినది. అప్పుడు జీవుఁడు కృతకృత్యుడైనట్లే, వారట్లేచేసిరి. వారు మాయిక గుణవాసనారహితులైరి. మనస్సు, ఇంద్రియములు వశమగునెడల, నింతవఱకు విషయాసక్తిచే విషయములఁ దిరిగిన మనస్సిప్పుడు విషయవిరతిని జెందును. ఈ సమయమున జీవకి ప్రాణమున్ను స్థాణువై పోవును. వాని చంచలతపోయి నిశ్చల వృత్తిగలవాఁడగును. వారు ముగ్గురు ఇట్టి స్థితిని బొందిరి.

ధర్మరా జిట్లనెను:- ''ఈట్లయినను స్వామీ! నేనచ్చటకు వెళ్లెదను. ఎట్లైనను వారిని తీసికొని వచ్చెదను. పోనిండు వారు నాయంతఃపురములో నుండకున్న మాననిండు, గంగాతీరమున వారికి సమస్త యేర్పాటులు కావించి, నేనక్కడనేయుండి సర్వదా స్వయముగా వారి సేవ చేయుచుందును.''

నారదుఁ డిట్టనెను:- ''రాజా! నీకీ ప్రయాసము వ్యర్థము. వారిచ్చటినుండి మోహమును వీడి వెళ్లిపోయినారు. నీవు వారికేవిధమగు కష్టమును గలిగింపలేదు. నీయెడల నసంతుష్టులయ్యు వారు వెళ్లిపోలేదు. వారి మరణసమయమున మీ వంటి బంధువులు వారినిఁజూడవలెనని వారికి లేదు. వారి భయము, అంత్యకాలమున వారి వృత్తి కుటుంబపరివారముమీఁదనుండి మరల జన్మింపవలసి వచ్చుననియే. కావున నీవు వారి కార్యముల కంతరాయము కలిగింపకుము. సర్వసంగ పరిత్యాగులగు నా మహానుభావుల మార్గమున కంతరాయము కలిగింపకుము. వారి పనిని వారినిఁజూచుకొన నిమ్ము నీపనిని నీవు చూచుకొనుము. అదియునుగాక నీవు ఒకవేళ వెళ్లినను వారింటికి దీసికొని రాలేవు. నేఁటికైదు దినములకు వారీ శరీరమును వదలివేయుదురు.''

ధర్మరా జిట్లనెను:- ''స్వామీ! వారు శరీరము నెట్లు వదలెదరు? అచ్చట వారికి దహనాదిక్రియ లెట్లు జరుగును?''

నారదుఁడిట్లు సమాదనా మొసంగెను:- ''నీకింకను దహనచింత కలదా? ఈ నశ్వర శరీరమును దహనము చేసిన నేమి? జలజంతువులు, కాకులు, గ్రద్ధలు, డేఁగలు పీకుకొని తినననేమి? లేక క్రుళ్లి, పురుగులుపడి మట్టి మట్టిలో గలిసిన నేమి? జ్ఞానికా చింత లేదు. మీ పెత్తండ్రిశరీరమును వనములోని దావాగ్ని దానికదియే బయలుదేరివచ్చి భస్మము చేయును. నీపెత్తల్లి కుటీరద్వారమున నిలుచుండి యీ సంగతినిఁ దెలిసికొని తానుగూడ కుటీరమునఁ బ్రవేశించి పతితోఁబాటు నిజశరీరమును భస్మము కావించుకొనును.''

ధర్మరాజిట్లనెను:- ''స్వామీ! పినతండ్రి యగు విదురుఁడుకూడ మండిపోవునా?''

నారదుఁడిట్లనెను:- ''కాదు. ఆతనికి ప్రభాసక్షేత్ర మున దేహత్యాగము చేయవలెనని కోరిక కలదు. కావున నాతఁడు తన యన్న వదినెగార్ల సద్గతికి సంతోషించి వారి వియోగ దుఃఖముచే దుఃఖితుఁడై మరల తీర్థయాత్రకు పోఁగలఁడు. ఆతఁడు మరల పుణ్యక్షేత్రములను దర్శించుచు జివరకు ప్రభాసక్షేత్రమునకు వెళ్లి, అచ్చట తన నశ్వరమగు భౌతిక దేహమును వదలి, మరల తన ధర్మరాజ పదవియందుండి జీవుల పాపపుణ్యముల నిర్ణయించు చుండును. నీవారి సమాచార మిది. ధర్మరాజా! ఇఁక నీవు వారిని గూర్చి శోకింపక నీ విషయ మాలోచించుకొనుము.''

ఈవిధముగ ధర్మరాజునకు వివిధములగు నుపదేశముల నొసంగి ధృతరాష్ట్రాది సర్వుల యంతిమగతినిఁ జెప్పి దేవర్షులలో శ్రేష్ఠుఁడగు నారదుఁడు తన ప్రియసఖుఁడగు తుంబురునితో హరిగుణ గానము చేయుచు, వీణ మీటుచు, దుఃఖిత ప్రాణులకు ప్రేమ పీయూషము నొసంగుచు, సమధుర త్రైలోక్య పావన మగు భగవన్నామమములను బాడుచు స్వర్గమునకు వెడలి పోయెను. ఇచ్చట ధర్మరాజు కూడ సమస్త వృత్తాంతమును విని, నారదోపదేశమును స్వరించుచుఁ దన పెత్తల్లి, పెత్తండ్రి, పిన తండ్రులను గూర్చి చింతన వీడి నిశ్చింతగనుండెను.

ఛప్పయ

నిత్యనియమ అనుసార యుధిష్ఠర గురు వందనకూఁ|

ఆయే, దేఖే నహీఁ, విదుర అరు కురునందన కూఁ|

సుని సంజయ తేఁవృత్త బహుత్‌ రోయే వఛితాయే|

ఆయే నారద సమాచార నచ సత్య సునాయే ||

తాఊ, తాఈతబ్‌ చచా సప్త స్రోత సచ జాయంగే |

పాప పుణ్య తేఁ పృధక్‌ హ్యై, పుణ్య పరమపద పాయంగే ||

అర్థము

ప్రతిరోజు దానుజేయు ప్రకారము యుధిష్ఠురుఁడు తన గురువులగు గాంధారీ ధృతరాష్ట్రులను జూడ వచ్చెను. అచ్చట వారిని, విదురునిఁ గానక సంజయ నడిగి తెలిసికొని మిక్కిలిగ విలపించి పశ్చాత్తాపము చెందెను. అప్పుడు నారదుఁడు వచ్చి యథార్థవృత్తాంతము నంతయుఁ జెప్పెను.

ధర్మరాజా! మీ పెదతండ్రియుఁ, బెదతల్లియు, పిన తండ్రియు హరిద్వార సమీపమున నున్న సప్తస్రోత దగ్గఱకు పోవుదురు. అచ్చట పాపపుణ్యముల రెంటినిఁ బోఁగొట్టుకొని పుణ్యమగు పరమపదమును బొందఁగలరు.

BHAGAVATA KADHA-3    Chapters